శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (16:11 IST)

కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య

కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక శాసనసభ తాత్కాలిక సభాపతిగా కె.జి. బోపయ్యను నియమించారు. శనివారం జరిగే అసెంబ్లీ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన

కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక శాసనసభ తాత్కాలిక సభాపతిగా కె.జి. బోపయ్యను నియమించారు. శనివారం జరిగే అసెంబ్లీ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
 
అనంతరం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వంపై విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతాయి. బోపయ్య బీజేపీ నేత. ఆయన 2009 నుంచి 2013 వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన కొడగు జిల్లా, విరాజ్‌పేట నియోజకవర్గం నుంచి గెలిచారు. 
 
నిజానికి ప్రొటెం స్పీకర్‌గా ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో అత్యంత సీనియర్ సభ్యుడుని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ్‌పాండేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సి ఉంది. ఇపుడు ఈ నిబంధనను తుంగలో తొక్కి, జూనియర్ అయిన కేజే బోపయ్యను నియమించారు. 
 
కానీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్.. ఇపుడు బీజేపీకి చెందిన సభ్యుడునే ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. అంటే సభలో ఏదో విధంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని గట్టెక్కించాలన్న ధోరణితోనే గవర్నర్ కూడా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.