బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (19:26 IST)

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు: రేవంత్‌రెడ్డి

తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు.

ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని. తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇదే సీన్ క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇందిరాపార్క్ వద్ద సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని మరీ ధర్నా చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలనుకుంటే రైతుల కళ్లాలకు వెళ్లాలని రేవంత్ సూచించారు. రేపటి నుంచి ఈనెల 23 వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్లాలలో ఉద్యమం చేస్తుందని తెలిపారు.

ధాన్యం కొనేందుకు ఈనెల 23 వరకు కేసీఆర్‌కు సమయం ఇస్తున్నామని, అప్పటికి కూడా ఈ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై మోదీని నిలదీయాలని రేవంత్ డిమాండ్ చేశారు.