సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:57 IST)

జయరామ్ హత్య కేసుకు కబాలి నిర్మాతకు లింకేంటి? కుక్కలకు ఇచ్చే విషంతో చంపేశారు...

కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, పారిశ్రామికవేత్త, ఎన్నారై జయరామ్ అలియాస్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నిర్మించిన 'కబాలి' చిత్ర నిర్మాత పేరు కేపీ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి కోసం కబాలి నిర్మాత పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. 
 
కృష్ణా జిల్లా నందిగామ జాతీయ రహదారికి సమీపంలో ఓ కారులో ఉన్న ఎన్నారై జయరామ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై విషయ ప్రయోగం జరిపి హత్య చేసినట్టు నిర్ధారించారు. పైగా, జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు రాకేష్ రెడ్డి మరికొందరు కిరాయి ముఠా సభ్యులతో కలిసి ఈ హత్య చేసినట్టు అంగీకరించారు. 
 
జయరామ్‌కు కుక్కలను చంపేందుకు ఉపయోగించే విషాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్టు రాకేష్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని నందిగామకు తీసుకెళ్లి పడేసినట్టు ఒప్పుకున్నాడు. సాధారణంగా జబ్బు సోకిన కుక్కలకు యుథనేషియా అనే మత్తు మందు ఇస్తే అవి మత్తులోకి జారుకుని చనిపోతాయి. అదేవిధంగా జయరామ్‌ను ఇక్కడ చంపేశారు. 
 
ఇదిలావుంటే, శిఖా చౌదరి కోసం 'కబాలి' తెలుగు నిర్మాత కేపీ చౌదరి నందిగామ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. శిఖా చౌదరితో ఆయనకేం సంబంధం అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేపీ చౌదరి దీనిపై స్పందించారు. శిఖా తనను అన్నయ్య అని పిలుస్తుందని చెప్పారు. విచారణ నిమిత్తం శిఖాను తన బీఎండబ్ల్యూ కారులోనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లోనే దిగబెట్టానని చెప్పారు.
 
సాయంత్రం తిరిగి కారును తీసుకెళ్లేందుకు తానే స్వయంగా వెళ్లినట్టు తెలిపారు. జయరాం హత్య గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం శిఖాకు లేదన్నారు. శిఖా జయరాంల మధ్య ఎంతో ప్రేమానుబంధం ఉందని.. కాబట్టి ఆమెకు ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డి గురించి తనకు అసలు తెలియదని స్పష్టంచేశారు.