శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (08:34 IST)

తొలి అడుగు మాత్రమే.. ముందుంది మొసళ్ళ పండుగ : మోడీకి బాబు వార్నింగ్

కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్

కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందుముందు మరిన్ని షాకులిచ్చేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగడం తొలి అడుగు మాత్రమేనని, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పునరుద్ఘాటించారు. 
 
ఎన్డీయే సర్కారు నుంచి తమ మంత్రులు రాజీనామా చేస్తారని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగే టీడీపీ, ఎన్డీయేలో మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. సంయమనం పాటిస్తూ ప్రయోజనాలను సాధించుకోవాలన్నది తన అభిమతమని, కేంద్రంపై మరింత ఒత్తిడి పెడుతూనే, సానుకూల నిర్ణయాలు వెలువడితే కలిసుంటామని లేనిపక్షంలో ఎన్డీయే కూటమి కూడా రాంరాం పలుకుతామని తేల్చి చెప్పారు. 
 
ఏం ప్రయోజనాలు ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతుందో తనకు తెలుసునని, ఏ ఉద్దేశంతో వారు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారో వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.