నిన్నే ప్రేమిస్తున్నానంటూ బాలికను రేప్ చేసిన కానిస్టేబుల్...
రక్షించాల్సిన పోలీసే కామాంధుడిగా మారాడు. అభంశుభం తెలియని మైనర్ బాలికను భయపెట్టి 8 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కానిస్టేబుల్ కావడంతో అతన్ని సస్పెండ్ చేసి విషయం బయటకు పొక్కనీయకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తపడుతున్నారు.
విజయవాడ సమీపంలోని కానూరుకు చెందిన ఎఆర్ కానిస్టేబుల్ బండి హరి తన ఇంటి పక్కనే ఉన్న మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ప్రేమ పేరుతోనే కాకుండా తను పోలీసు.. చంపేస్తానంటూ బెదిరించి 8 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలిస్తే చంపేస్తాడేమోనన్న భయంతో బాలిక సైలెంట్‌గా ఉంటూ వచ్చింది.
అయితే నిన్న వీరిద్దరు కలిసి ఉండడాన్ని తల్లిదండ్రులు కళ్ళారా చూశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు కానీ.. విషయం బయటకు చెప్పొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశారని బాధితులు చెపుతున్నారు. అయితే బాధితురాలు తల్లిదండ్రులు మాత్రం కానిస్టేబుల్ నిర్వాకాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు చెప్పారు.