3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!
పసిఫిక్ మహా సముద్రంలో కార్గో నౌక ఒకటి మునిగిపోయింది. మూడు వేల కార్లతో వెళుతున్న ఈ నౌకలో వారం రోజుల క్రితమే అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కారణంగానే భారీ నౌక నీటిలో మునిగిపోయివుండొచ్చని భావిస్తున్నారు.
ఈ రవాణా నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓ నౌక నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే, ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని, యూఎస్ కోర్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
జూన్ 3 తేదీన ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, వారందరూ లైఫ్‌బోట్ ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలిపారు.
ఆ సమంయలో సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించినట్టు తెలిపారు. ఓడకు వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు లోడింగ్ చేసివుండటంతో పెద్దమొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డు అధికారులు, నౌకా సంస్థ అధికారులు తెలిపారు.