'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరు : రజనీకాంత్
'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరని సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగుళూరు వెళ్లి తాను కండక్టరుగా పని చేసిన సమయంలో ఉన్న తన స్నేహితులను కలుసుకుంటూ ఉంటానని చెప్పారు. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళం తాజాగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులను ఉద్దేశించి రజనీకాంత్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
"నేను ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్తాను. అక్కడ నాతో పాటు డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసిన నా పాత స్నేహితులను కలుస్తాను. నా అసలు పేరు శివాజీని నేను దాదాపు మర్చిపోయాను. కానీ నా స్నేహితులు నన్ను ఆప్యాయంగా రేయ్, ఒరేయ్, ఒరేయ్ శివాజీ అని పిలిచినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది. ఆ పిలుపులోనే ఎంతో మాధుర్యం ఉంది. అందుకే పాత స్నేహితులను, స్నేహాన్ని వదులుకోవద్దు. వీలు చిక్కినపుడల్లా వెళ్లి స్నేహితులను కలుసుకుంటూ ఉండండి అని సూచించారు.
అలాగే, బంధువుల కంటే స్నేహితులను కలవడం మరింత ఆనందాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి మాజీ డీజీపీ శైలేంద్ర బాబు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని ప్రశంసించారు.శైలేంద్రబాబు ఫిట్నెస్ సినిమా హీరోలకు కూడా లేదని ఆయన గుర్తు చేశారు.