పెదరాయుడుకి 20 యేళ్లు .. రజనీకాంత్ వల్లే ఈ సినిమా నిర్మించా: మోహన్ బాబు
పెదరాయుడుకి 20 యేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం విడుదలై తెలుగునాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'పెదరాయుడు'. ఈ చిత్రం విడుదలై నేటికి (జూన్ 15వ తేదీకి) 20 యేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర హీరో, నిర్మాత తన మనస్సులోని మాటను వెల్లడించారు. ఈ చిత్రం తమిళ రీమేక్. 1994లో 'నాట్టామై'గా ఈ చిత్రం విడుదలైంది.
తెలుగులోకి 'పెదరాయుడు'గా రీమేక్ చేశాం. ఒక రోజు తన మిత్రుడు రజనీకాంత్ ఫోన్ చేసి, 'నాట్టామై' సినిమా బాగా ఆడుతోంది, చూడమని చెప్పారు. సినిమా చూసి 'బాగుందిరా' అని అన్నానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రైట్స్ తీసుకోమని సూచించారని... పాపారాయుడు క్యారెక్టర్ తానే చేస్తానని చెప్పారని మోహన్ బాబు తెలిపారు.
అయితే, ఈ చిత్రంలో రజనీకాంత్ నటించినందుకు ఒక్కపైసా కూడా తీసుకోలేదనీ, పైగా.. ఈచిత్రం షూటింగ్ సమయంలో ఆర్థిక కష్టాలు తలెత్తినపుడు డబ్బులు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వేరే రూపంలో తానిచ్చిందేదో రజనీ మారుమాట్లాడకుండా స్వీకరించారన్నారు. అలాంటి మిత్రుడు తనకుండటం తన అదృష్టమని రజనీని కొనియాడారు. పెదరాయుడు విడుదలై అప్పుడే 20 ఏళ్లు గడచిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అప్పట్లో 200 రోజుల విజయోత్సవ పండుగను దివంగత ఎన్టీఆర్ సమక్షంలో నిర్వహించామని చెప్పారు.
కాగా, ఈ చిత్రాన్ని సొంత బ్యానర్‌పై నిర్మించగా, ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయగా, సూపర్ స్టార్ రజనీకాంత్ పెదరాయుడి తండ్రి పాపారాయుడిగా నట విశ్వరూపం చూపించారు. భానుప్రియ, సౌందర్యలు కథానాయికల పాత్రల్లో జీవించారు.
