అమరావతి పేరు పలకడానికి జగన్ ఇష్టపడరు.. అందుకే మావిగన్ అనే వింతపేరు : సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిన మావిగన్ పేరుతో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఈ వింత పేరుపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. ఏపీకి ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన జగన్.. ఇపుడు మావిగన్ అనే వింత పేరును తెరపైకి తెచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దీనికి వెనుక కారణం లేకపోలేదన్నారు. అమరావతి పేరును పలకడానికి జగన్ ఇష్టపడరని, అందుకే మావిగన్ అనే వింత పేరును ప్రతిపాదించారన్నారు. ఇది అమరావతిపై జగన్‌కు ఉన్న విద్వేషానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం కూటమి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారితో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 'అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. రాజధాని పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని బుధవనారంతో మరోసారి స్పష్టమైంది' అని చంద్రబాబు అన్నారు. రాజ్యసభలో గురువారం అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించనుందని చెప్పారు.

