ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:31 IST)

కొడాలి నానితో చంద్రబాబు తెల్లవెంట్రుక కూడా కదలదు: హమ్మ! దివ్యవాణి ఎంత మాట అనేసింది

రాష్ట్రప్రభుత్వ పనితీరు, నాయకుల మాటతీరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఏపీ వాసుల భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేలా ప్రవర్తిస్తున్న కొందరిని చూస్తుంటే, వీళ్లా మన నాయకులు అనిపిస్తోందని టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి వాపోయారు. శనివారం ఆమె తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా....
 
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అయిన కొడాలి నాని పనితీరు, మాటలు ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు, నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉంది. కరోనా వైరస్ తీవ్రత, దాని ప్రభావం తెలిసుంటే, నాని చంద్రబాబు వేషధారణ గురించి మాట్లాడేవాడా?

వ్యక్తిత్వంతోపాటు, ఏ అంశంలోనైనా సరే, చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి తెలుసుకోవాలి. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆనాడు జరిగిన పరిణామాలన్నీ తనే దగ్గరుండి జరిపించాడా లేక నాటి ఘటనలకు తనే స్క్రిప్ట్ రాశాడా? నానిగారే నాటి పరిణామాలకు కథ, స్క్రీన్ ప్లే రాశారా?

స్వర్గీయ ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఆయనకు ప్రమాదమని తెలిసికూడా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్‌కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? స్వామీ.. నాథా అని చంద్రబాబు ఎన్టీఆర్ పంచన చేరలేదని నాని తెలుసుకోవాలి. 

చంద్రబాబు నాయుడు ఆనాడు పార్టీని పట్టిపీడిస్తున్న దుష్టశక్తులను వదిలించి, పార్టీ పగ్గాలు చేపట్టకపోయి ఉంటే, అప్పుడే తెలుగుదేశం పని ఖతం అయ్యేది. ఆ విషయం కొడాలి నానికి తప్ప, రాష్ట్రప్రజలందరికీ తెలుసు. మరోసారి ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు గారి గురించి నాని మాట్లాడితే, ప్రజలు ఆయన జుట్టుకోసి చేతుల్లో పెడతారు.

చంద్రబాబు తండ్రైన  ఖర్జూరనాయుడి కుటుంబం రౌడీయిజంతో, ఫ్యాక్షనిజంతో పైకి రాలేదు. చంద్రబాబుకు ఉన్న తెలివితేటలను వ్యాపార రంగంపై పెట్టిఉంటే, ఆయన ఎప్పుడో బిల్ గేట్స్‌ను మించిపోయేవాడు. చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?

అభివృద్ధిలోగానీ, పనితీరులో గానీ చంద్రబాబుతో పోటీపడేవారెవరైనా సరే వైసీపీలో ఉన్నారా? ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా సరే చంద్రబాబుతో సమానంగా పట్టుదలతో ప్రజల కోసం పనిచేయగలరా? చంద్రబాబుతో కరెక్ట్‌గా అటూఇటూ వంగకుండా గంటపాటు నడిచే దమ్ము కూడా మీకు లేదు.

నానికి చంద్రబాబుపై ఎంత ద్వేషముందో, ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో, ఏం చేస్తున్నామో ఒక్కసారి కొడాలి నాని, ఇతర వైసీపీనేతలు ఆలోచిస్తే మంచిది. గతంలో చంద్రబాబును గురించి ఒకపేపర్లో చులకనగా రాశారని, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  సదరు రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని నాని లాంటి వాళ్లు ఎన్ని అన్నా, ఆయన తెల్ల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు.

దేవినేని ఉమా ఏదైనా మాట్లాడితే పద్ధతి ప్రకారం సమాధానం చెప్పండి అంతేగానీ, లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు మంత్రిస్థాయిలో ఉండి చేయడం బాధాకరం. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, ప్రశ్నించిన వారిని చంపేస్తాం....లేపేస్తాం అని బెదిరిస్తారా?  అలా చేస్తే, ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారా?

జగన్ ప్రజల సొమ్ముని కోర్టు ఖర్చులకు, రంగులేయడానికి దుబారా చేయకుండా, ఆ సొమ్ములో కొంతభాగం ఖర్చు పెట్టయినాసరే తన పార్టీ వారికి సభ్యత, సంస్కారాలు, మంచిభాష నేర్పితే మంచిది. రాబోయే మూడేళ్లలో అయినా ప్రజలకు మంచి పాలన అందించండి. 151 సీట్లు వచ్చాయని సంబరపడకుండా ఇచ్చిన వాగ్ధానాలను అమలుచేస్తే మంచిది.

రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మోటార్లకు మీటర్లు బిగిస్తారా? మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవి వచ్చాక  నాని దాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు? ఇప్పటికైనా నాని తన తప్పు తెలుసుకొని తన వ్యాఖ్యలపై ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వరద బాధితుల కుటుంబాలకు ఇస్తామన్న రూ. 5 వేల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.