మహిళా టెక్కీని సజీవదహనం చేసిన ప్రియుడు.. ఎక్కడ?
చెన్నై నగర శివారు ప్రాంతంలో ఓ మహిళా టెక్కీని ఆమె ప్రియుడే సజీవదహనం చేశారు. శనివారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న తాళంబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రియుడే హంతకుడని తేలింది. చెన్నై పెరుంగుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, చెన్నై సిరుచ్చేరి ఐటీ పార్కులో నందిని (25) ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఈమె మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్ ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మదురైలోని హైస్కూల్ నుంచి నిందితుడు వెట్రిమారన్‌తో నందిని స్నేహంగా మెలుగుతూ వచ్చింది. వెట్రిమారన్ తిరువళ్లూరు జిల్లా ముప్పేడులో నివాసం ఉంటుండగా, నందిని మాత్రం కన్నగి నగర్‌లోని అత్త ఇంట్లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. పైగా, వెట్రిమారన్‌తో ఉన్న పాతకాలపు స్నేహబంధాన్ని కూడా తెంచుకుంది. అయితే, వెట్రిమణిమారన్ ఓ ట్రాన్స్‌జెండర్ అని తేలడంతో అతన్ని దూరంగా పెట్టిన నందిని.. రాహుల్ అనే వ్యక్తిని ప్రేమించసాగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మణిమారన్ జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు.
శనివారం నందిని పుట్టిన రోజు కావడంతో సర్ప్రైజ్ ఇస్తామని నమ్మించి ఓ ప్రదేశానికి పిలిపించి రాత్రి 7.15 గంటల ప్రాంతంలో హత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఆమె కళ్లకు గంతలు కట్టి.. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి... బహుమతి ఇస్తానని చెప్పి ఖాళీ ప్లాట్‌లోకి తీసుకెళ్లి మణికట్టు, చీలమండలను కోసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో
అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టిన మణిమారన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.