గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు రవాణాకు అత్యంత ప్రధాన మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. అయితే, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ పశ్చిమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదు.
ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో ప్రయాణించిన ఒక చమురు ట్యాంకర్ కొన్నిగంటల క్రితం ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌ను చేరుకుంది. ఆ నౌక జలసంధి మీదుగా వస్తున్నప్పుడు.. దానిపై దాడి జరిగింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ప్రయాణం గురించి పారాదీప్ పోర్ట్ అథారిటీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
రెండు మిలియన్ బ్యారెళ్ల ఇరాక్ చమురును మోసుకొచ్చిన ఆ నౌక పేరు ఎంటీ సన్మార్ హెరాల్డ్. ఇరాన్ జలాల్లో ఉన్నప్పుడు ట్యాంకర్‌పై దాడి జరిగిందని పోర్ట్ అథారిటీ వెల్లడించింది. కార్గోతోపాటు అందులోని సిబ్బంది భద్రత దృష్ట్యా.. ఘటన అనంతరం నౌక తన మార్గాన్ని మార్చుకున్నట్లు తెలిపింది.
ఎలాంటి భద్రతా ఉల్లంఘనలు లేకుండా భారత నౌకాదళంతో సమన్వయం చేసుకుంటూ దేశ తీరంవైపు ప్రయాణాన్ని కొనసాగించినట్లు వెల్లడించింది. ఈ నౌకపై తుపాకులతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎవరు చేశారన్నది మాత్రం తెలియరాలేదు. తాజాగా పారాదీప్ పోర్ట్‌కు 22 కి.మీ.దూరంలో ఇది లంగరేసింది. దానిలో నుంచి ఇప్పుడు చమురును అన్‌లోడ్ చేయనున్నారు.
