గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (13:26 IST)

#DelhiResults : ఆ ధైర్యం ముందు చిన్నబోయిన రాజకీయ దిగ్గజ వ్యూహాలు

దేశానికి గుండెకాయవంటి హస్తినలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలు ఏమాత్రంపారలేదు. ఫలితంగా గత ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ కాషాయపు జెండాను ఎగురవేయలేక పోయారు. ముఖ్యంగా, సాదాసీదా వ్యక్తి ధైర్యం ముందు బడా రాజకీయ దిగ్గజాల వ్యూహాలు చిన్నబోయాయి. ప్రజాసంక్షేమం, అవినీతిరహిత పాలనే ప్రధాన అస్త్రాలుగా దిగిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారు. 
 
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి చీపురుపట్టి ఢిల్లీని ఊడ్చేసింది. మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 58కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో జాతీయ పార్టీలైన బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీ మరోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. 
 
కాగా పార్లమెంటు ఎన్నికలు జరిగి సంవత్సరం కూడా తిరక్క ముందే... హస్తినలో ఆయా పార్టీల హస్తరేఖలు మారిపోవడంపై రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది. గతేడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా మొత్తం ఏడు ఎంపీ సీట్లలో విజయభేరీ మోగించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢిల్లీ ఓటర్లు ఛీకొట్టారు. 
 
దీంతో కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు కావాలనే దానిపై ఢిల్లీ ఓటరుకు స్పష్టమైన అవగాహన ఉందనేందుకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అచ్చం ఇదే పరిస్థితి చోటుచేసుకున్న విషయం గుర్తు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ మేనియా కారణంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. 
 
ఆ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మొత్తం 70 స్థానాలకుగానూ ఆమాద్మీ పార్టీ 67 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయగా... బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మళ్లీ ఇప్పుడు దాదాపుగా అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. అయితే, గత ఎన్నికల కంటే ఈ దఫా బీజేపీకి కాసిన్ని సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది.