శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (15:21 IST)

ఢిల్లీ విద్యార్థులకు బంపర్ ఆఫర్... ఉచితంగా ఇంటర్నెట్

ఢిల్లీ విద్యార్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉచితంగా 1.5 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఢిల్లీ నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్ సెంటర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇది తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన చివరి వాగ్దానంగా ఆయన వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఇంట‌ర్నెట్ క‌స్ట‌మ‌ర్ల‌కు వైఫై హాట్‌స్పాట్‌ల ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో మ్యానిఫెస్టోలో ఉన్న చివ‌రి వాగ్దానాన్ని నిల‌బెట్టుకున్న‌ట్లు సీఎం కేజ్రీ చెప్పారు. ఈ స్కీమ్ విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌న్నారు. 
 
దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో మొత్తం 11 వేల హాట్ స్పాట్ సెంట‌ర్ల‌ను ఓపెన్ చేయ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. డిసెంబ‌ర్ 16వ తేదీన వంద హాట్‌స్పాట్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తామ‌న్నారు. ఆ త‌ర్వాత ప్ర‌తి వారం 500 హాట్‌స్పాట్ల‌ను స్టార్ట్ చేస్తామ‌న్నారు. మొత్తం ఆరు నెల‌ల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌న్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలిపారు. 
 
మొత్తం వంద కోట్ల ఖ‌ర్చుతో ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. ఈ స్కీమ్‌పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. కేజ్రీవాల్ అబద్ధాలు ఆడుతున్న‌ట్లు గంభీర్ ఆరోపించారు. నాలుగున్న‌ర ఏళ్ల క్రితం అదే చెప్పారు, ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు అదే చెప్పారు, ఇప్పుడు ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ అదే చెబుతున్నార‌ని గంభీర్ విమర్శించారు.