1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Aarthi Agarwal died

ఆర్తీ అగర్వాల్ గుండెపోటుతో కన్నుమూత... లైపో చికిత్స చేయించుకుంటూ న్యూజెర్సీలో...

Aarthi Agarwal died
ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ఆర్తీ అగర్వాల్ కన్నుమూసింది. అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో శ్వాసకోస సంబంధిత సమస్య(ఆస్త్మా)కు చికిత్స చేయించుకుంటున్న సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. 31 ఏళ్ల ఆర్తీ అగర్వాల్ గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు ఆమె వెళ్లారు. గత కొంతకాలంగా ఆమె అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. కానీ చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.
 
సినీ ఇండస్ట్రీలో వెంకటేష్, మహేష్ బాబు, తరుణ్ వంటి అగ్ర హీరోలతో నటించిన ఆర్తీ అగర్వాల్ గతంలో కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినప్పటికీ తేరుకుని సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నటిగా మళ్లీ ప్రేక్షకులను కనువిందు చేశారు. 2007 నవంబర్ 22న ఆర్తీ రాణీ గంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్జ్వల్ కుమార్‌ను వివాహమాడింది. 
 
ఇకపోతే.. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఈమె 16వ ఏట 2001లో విడుదలైన హిందీ మూవీ పాగల్‌పన్‌తో భారతీయ సినిమాలో అరంగేట్రం చేసింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. నువ్వు నాకు నచ్చావ్ ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. 
 
తెలుగు సినీ రంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునల సరసన నటిండమే కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్‌లతో నటించి తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపింది. వెంకీతో నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి వంటి సినిమాల్లో నటించి మంచి పేరు కొట్టేసింది.
 
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆర్తీ అగర్వాల్‌కు మంచి అవకాశాలు వచ్చినా శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటుండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఆర్తీ అగర్వాల్ మృతితో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి