తెలుగు చలనచిత్ర చరిత్రలో టి.ఎల్.కాంతారావుకి ఓ ప్రత్యేక స్థానం వుంది. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకి రెండు కళ్ళు అనుకుంటే కాంతారావు ఆ రెండు కళ్ళ మధ్య కుంకుమ లాంటివారు అని ఆయన్ని కొనియాడేవారు. పౌరాణిక పాత్రలు చేయడంలో సాటిలేని పేరు తెచ్చుకున్న ఎన్.టి. రామారావు కూడా 'నారదుడి పాత్ర నీ కోసమే వుంది. అది నువ్వు తప్ప ఎవ్వరూ చెయ్యలేరు' అని కాంతారావుని ప్రశంసించారంటే ఆ పాత్రలో కాంతారావు ఎంత లీనమై నటించేవారో అర్థమవుతుంది.
తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంతారావు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించారు. దాదాపు 450 చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ఆయన నటుడిగా, నిర్మాతగా, పరిశ్రమ శ్రేయోభిలాషిగా, దాతగా, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఆ చిత్రాలకు ఓ ప్రత్యేకతను చేకూర్చి కత్తి కాంతారావుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
నవంబర్ 16 టి.ఎల్.కాంతారావు 92వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత్ కల్చరల్ అకాడమీ స్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జయంతి ఉత్సవాలు జరిగాయి. భారత్ కల్చరల్ అకాడమీ నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా కాంతారావు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా టి.ఎల్.కాంతారావు సతీమణి శ్రీమతి హైమావతికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా పూలమాల, శాలువాతో మాతృవందనం చేశారు. తెలంగాణా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు పి. అమరేష్ కుమార్ 51 వేల రూపాయల నగదును శ్రీమతి హైమావతికి అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు పి.అమరేష్‌కుమార్, టి.ఎల్.కాంతారావు సతీమణి హైమావతి, కాంతారావు కుమారుడు రాజా, కుమార్తె సుశీల, ఆంధ్రప్రభ సంపాదకులు విజయ్‌బాబు, డా|| కె.వి.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు కాంతారావుకి ఎటువంటి గౌరవం దక్కలేదని, తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కావడంవల్ల అతనిపై వివక్ష చూపారని, స్థలం కానీ, ఇల్లు కానీ, అవార్డుగానీ, ప్రభుత్వం తరఫున ఎటువంటి లబ్ది ఆయన పొందలేదని సభలో వక్తలు చెప్తూ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచారు.
1. స్వర్గీయ కాంతారావు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం అందించాలి.
2. స్వర్గీయ కాంతారావు స్మారకంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని అటు ట్యాంక్ బండ్‌పైన, ఇటు ఫిలింనగర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టించాలి.
3. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏకైక మహానటునికి సంబంధించిన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా భావితరాల వారికి అని తరగతి పుస్తకాల్లో చేర్చేందుకు ప్రయత్నం జరగాలి.
4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి 'కాంతారావు మీడియా యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్'గా నామకరణం చేయాలి.
5. కాంతారావు కుటుంబానికి ఇల్లు గురించి కనీసం 500 గజాల స్థలం తెలంగాణ ప్రభుత్వం కేటాయించాలి.
కాంతారావు విషయంలో ఇప్పటివరకు వున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయని ఈ ప్రభుత్వమైనా ఆయనకు తగిన గౌరవం కల్పించాలని విజయ్‌బాబు కోరారు. తెలంగాణ కళాకారుడైన కాంతారావుగారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసుననీ, ఆయన కూడా వివక్షకు గురయ్యారని, ఆయన తర్వాతి తరంవారు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు పొందారని ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నాగబాల సురేష్‌కుమార్ అన్నారు.
చాలామంది విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్లక్ష్యం చేసిందనీ, ఈ విషయంలో అందరం స్పందించాల్సిన అవసరం వుందనీ, కొంతమందికే ఎందుకు అన్యాయం జరిగిందో చర్చించాల్సిన అవసరం కూడా వుందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. కాంతారావుగారికి పద్మశ్రీ ఇస్తున్నారని తెలిసి ఎంతో సంతోషించానని, మరుసటిరోజు అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నానని ఆయన చెప్పారని, చివరి క్షణంలో అవార్డు కాంతారావుగారికి ఇవ్వడం లేదని తెలిసి ఆయన ఎంతో బాధపడ్డారని డా|| కె.వి.కృష్ణకుమారి అన్నారు.
కళాకారుడికి భాషా భేదాలు లేవు అన్నంది ఎంత నిజమో, చిత్ర రంగం చిత్రంగా వుంటుందనేది కూడా అంతే నిజమని, నారదుని పాత్ర నీకోసమే వుంది. నేను ఆ పాత్ర చెయ్యను అని కాంతారావుగారితో రామారావుగారు అన్నారంటే ఆయన హృదయం ఎంత విశాలమైందో, సాటి కళాకారుడికి ఎంత గౌరవం ఇస్తారో అర్థం చేసుకోవచ్చని కె.వి.రమణాచారి అంటూ కాంతారావుగారికి తీరని అన్యాయం జరిగిందని. ఇల్లు, స్థలం, ఉద్యోగం, ఆర్థికసాయం..అని ఇక్కడికి వచ్చినవారిలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన డిమాండ్ చేశారనీ, అయితే ఇవన్నీ జరగవచ్చుననీ, తను కాంతారావుగారి సతీమణిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారి దగ్గరకు తీసుకెళ్ళి, అన్నీ వివరిస్తానని కె.వి.రమణాచారి అన్నారు.