ఫైనాన్స్ కంపెనీకి వైకాపా మాజీ ఎమ్మెల్యే కుచ్చుటోపీ.. చీటింగ్ కేసు నమోదు
ఏపీలోని వైకాపా నేతలు అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మద్యం స్కామ్‌లో పలువురు నేతలు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఫైనాన్స్ కంపెనీని మోసం చేశారనే ఆరోపణలతో ఆయనతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. అప్పటికే అమ్మేసిన భూమిని రుణం కోసం తనఖా పెట్టి మోసానికి పాల్పడ్డారని ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే, శివకుమార్ 2019లో తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఏపీజే ఇంప్లెక్స్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న ఆయన భార్య అన్నాబత్తుని పుష్ప, విజయవాడకు చెందిన ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణానికి శివకుమార్ హామీదారుగా (గ్యారంటర్) ఉన్నారు. ఇందుకుగాను తెనాలిలోని 1,200 చదరపు గజాల స్థలాన్ని తనఖా పెట్టారు.
అయితే, రుణం తీసుకున్న తర్వాత వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో అసలు, వడ్డీలతో కలిపి బకాయి మొత్తం రూ.5 కోట్లు దాటింది. బకాయి వసూలు కోసం ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. తెనాలి మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం, ఆ స్థలంలో కేవలం 700 చదరపు గజాలు మాత్రమే శివకుమార్ పేరు మీద ఉందని, మిగిలిన 500 గజాలను 2012లోనే ఇతరులకు విక్రయించారని తేలింది.
అప్పటికే అమ్మేసిన భూమిని కూడా తమదిగా చూపించి, మొత్తం 1,200 గజాల స్థలాన్ని తనఖా పెట్టి మోసం చేశారని ఐకేఎఫ్ ఫైనాన్స్ లీగల్ మేనేజర్ శ్రీనివాసరావు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాటి ఎమ్మెల్యే హోదాను దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడ్డారని, రిజిస్ట్రేషన్ కార్యాలయం స్థాయిలోనూ అవకతవకలు జరిగి ఉండవచ్చని ఆయన తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అన్నాబత్తుని శివకుమార్, ఆయన భార్య పుష్ప, కంపెనీ మేనేజింగ్ భాగస్వామి తూనుగుంట్ల శ్రీనివాస్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
