దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం - ఏపీ వైపు దూసుకొస్తోంది...
అర్నబ్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా తేరుకోలేనేలేదు. ఇంతలో మరో తుఫాను కేంద్రీకృతమైంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడి, ఇది ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో నెలకొనివున్న ఈ అల్పపీడనం అక్కడే స్థిరంగా కొనసాగినప్పటికీ వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి సుస్పష్టం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం గురువారం ఉదయం ఒక ప్రకటన చేసింది.
అక్టోబరు 29వ తేదీ ఉదయం 8.30 గంటల సమయానికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం నమోదైంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది వాతావరణ వ్యవస్థ స్థిరంగా ఉన్నదనడానికి సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకునివున్న అండమాన్ అండ్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం కదలికలను వాతావరణ శాఖ నిశితంగా గమనిస్తోంది. దీని తదుపరి గమనం, ప్రభావంపై ఎప్పటికపుడు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.

