గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (10:29 IST)

పుట్టింటికి వెళ్లిన భార్య.. బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన డ్రైవర్

తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. దిశ అత్యాచార, హత్య కేసు దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. ఆ మరుసటిరోజే హైదరాబాద్ నగరంలో మరో అత్యాచారం జరుగగా, తూర్పు గోదావరి జిల్లాలో 50 యేళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంతలోనే సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆ బాలికను రెండో పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసలబస్తీకి చెందిన భార్గవ్ (32) అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య గర్భందాల్చడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అతని ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె (16) బాలిక ఇంటి పనిచేస్తూ వస్తోంది. ఆమెపై మనసుపడిన భార్గవ్... ప్రేమ పేరుతో వేధించసాగాడు. పైగా రెండో పెళ్లి చేసుకుంటానని ఏకంగా ఆ బాలిక తండ్రినే అడిగాడు. దీంతో ఆయన ఆగ్రహించి భార్గవ్‌ను మందలించి వదిలివేశాడు. 
 
అయినా అతనిలో మార్పు రాలేదు. మాయమాటలతో బాలిక ఫొటోలు తీసి.. బాలిక తండ్రికి పంపించి.. మీ కుమార్తెను ప్రేమిస్తున్నానని, రెండో వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే భార్గవ్‌ భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్గవ్‌.. బాలికను యాదగిరి గుట్టకు తీసుకువెళ్లి లాడ్జిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్గవ్‌ను అరెస్టు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.