1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జులై 2025 (13:47 IST)

మనీ కంటే నా దేశమే గొప్ప : శిఖర్ ధావన్

shikhar dhawan
వరల్డ్ ఛాంపియన్‌‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసిఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపడమే కారణమని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. శిఖర్ ధావన్, హార్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ సహా పలువురు మాజీలు ఈ మ్యాచ్ నుంచి వైదొలిగారు. దీంతో చేసేదేమీలేక నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఇంగ్లాండ్‌లోని ఎడ్‌బాస్టన్ స్టేడియం వద్దకు ప్రేక్షకులు ఎవరూ రావొద్దని, టికెట్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, పాక్ మ్యాచ్ ఆడేది లేదని తాను మే 11వ తేదీనే చెప్పానని గబ్బర్ (ఇర్ఫాన్ పఠాన్) తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసిన కొద్దిసేపటికే డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 
ఇదిలాఉంటే.. 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మాజీ భారత క్రికెటర్లు పాకిస్థాన్‌తో పోటీ పడటంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌‍తో జరిగే మ్యాచ్‌లో తాను పాల్గొనడం లేదని శిఖర్ ధావన్ తాజాగా ఎక్స్‌లో ధ్రువీకరించాడు. మనీ కంటే దేశమే తనకు ముఖ్యమని ప్రకటించారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సంబంధించి భారత జట్టు టోర్నమెంట్ నిర్వాహకులకు పంపిన మెయిల్ స్క్రీన్ షాట్‌ను భారత మాజీ ఆటగాడు షేర్ చేశాడు.