1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hyderabad : mother kill two kids and suicide

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

suicide
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని వేధిస్తుండటంతో భరించలేని ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
వరంగల్‌ జిల్లా ఎల్లయ్యగూడెం పంచాయతీలోని మాణిక్యం తండాకి చెందిన బోడ ప్రవీణ్‌ అదే పంచాయతీలోని పదహారు చింతల తాండాకు చెందిన స్రవంతి (30)ని 15 యేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు ప్రస్తుతం మూసాపేట పరిధి రాఘవేంద్ర సోసైటీలో నివాసముంటున్నారు. ప్రవీణ్‌ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా స్రవంతి హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తోంది. వీరికి కార్తిక్‌ (12), కౌశిక్‌ (10) సంతానం. 
 
అయితే, స్రవంతికి చెల్లెలి వరుసయ్యే మహేశ్వరిని ఏడాది క్రితం ప్రవీణ్‌ రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రవీణ్ భార్యతో విడిపోయి అక్కడి సమీపంలో మరో ఇంట్లో నివాసం ఉంటున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సేవించి స్రవంతి వద్దకు వచ్చి ప్రవీణ్‌ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో చివరిసారిగా మూడు రోజుల క్రితం ప్రవీణ్‌ సొంతూరైన మాణిక్యం తండాలో మళ్లీ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ప్రవీణ్, స్రవంతిలు కలిసి ఉండాలని పెద్దలు తీర్మానించి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో దంపతులిద్దరూ సోమవారం నగరానికి చేరుకున్నారు.
 
మంగళవారం ఉదయం ప్రవీణ్‌ పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజన సమయానికి తిరిగివచ్చారు. అప్పటికే స్రవంతి తలుపు గడియ పెట్టుకుని ఎంతకీ తీయలేదు. ఇరుగుపొరుగు సహాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా భార్యతో పాటు ఇద్దరు కుమారుల మృతదేహాలు ఇంటిపై కప్పునకు వేళాడుతూ కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
తర్వాతి కథనం
భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో