గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (16:28 IST)

నవ్యాంధ్ర కోసం చంద్రబాబు - పవన్‌ల చర్యలు ఫలించేనా?

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు కృషి చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాలనాయంత్రాంగాన్ని చక్కబెట్టుకుంటూనే, మరోవైపు.. పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టుకు

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు కృషి చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాలనాయంత్రాంగాన్ని చక్కబెట్టుకుంటూనే, మరోవైపు.. పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టుకుని ముందుకుసాగుతున్నారు.
 
అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు జనసేన పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధన కోసం ఆయన ఉద్యమబాట పట్టనున్నారు. 
 
ఇందుకోసం సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ ద్వారా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎన్ని నిధులు ఇచ్చింది? రాష్ట్రం ఏమేరకు ఖర్చు చేసింది? తదితర అంశాలపై ఆరా తీయనున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ వైఖరిపై పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం మాత్రం నోరుజారడం లేదు. పైగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని నేతలను ఆదేశించారు. రాష్ట్రానికి మంచి చేయాలనేది పవన్ అభిమతమని... మనం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని... ఈ నేపథ్యంలో, ఇద్దరి దారీ ఒకటేనని చెప్పారు. పవన్ పట్ల సున్నితంగా వ్యవహరించాలని తెలిపారు. అవసరమైన సమయంలో టీడీపీకి ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పారు. 
 
పవన్ ప్రకటించిన జేఎఫ్సీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిధుల గురించి పవన్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను ఇవ్వాల్సింది కేంద్రమేనని... రాష్ట్ర ప్రభుత్వం కాదని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు కూడా చేరవేసి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు. 
 
ఇదిలావుంటే, నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ విధించిన గడువు గురువారంతో ముగియనుంది. శుక్రవారం జేఎఫ్‌సీ నేతలతో తన పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు జనసేన కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద నవ్యాంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న ప్రధాన ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు అడుగులు వేస్తున్నారు.