నెతన్యాహు లైవ్ వీడియో, హుషారుగా కాఫీ తాగుతూ ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలకు నెతన్యాహు చెక్ పెట్టారు. ఎంతో హుషారుగా కాఫీ తాగుతూ తన రెండు చేతులకు వున్న వేళ్లను చూపుతా మాట్లాడారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెతన్యాహు చనిపోయాడన్న వార్తలకు చెక్ పడినట్లయ్యింది.
ఇదిలావుంటే అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన చేస్తున్న సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యూహు ప్రాణాలు కోల్పోయినట్టు ఊహాగానాలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీటిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారికంగా వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా నెతన్యాహుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు పైకెత్తగా, ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో ఈ వదంతులు మొదలయ్యాయి. ఇది ఏఐ సాయంతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, నెతన్యాహు చనిపోయి ఉండవచ్చని లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని నెటిజన్లు ప్రచారం చేశారు.
ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ఖాతా నుంచి నెతన్యాహు మరణవార్తను పోస్ట్ చేసి డిలీట్ చేశారంటూ ఓ ఫేక్ స్క్రీన్ షాట్ కూడా వైరల్ అయింది. మార్చి 14, 15 తేదీల్లో ఈ పుకార్లు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. టర్కీకి చెందిన వార్తా సంస్థ అనడోలు ఏజెన్సీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్, ప్రధాని క్షేమంగా ఉన్నారు అని తేల్చిచెప్పింది. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు నెతన్యాహు స్వయంగా వీడియోను విడుదల చేసారు.