చంద్రబాబు ఆహ్వానంతో అమరావతికి కేసీఆర్ వస్తారా? వస్తే ఆ ప్రారంభోత్సవం మాటేంటి?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అమరావతి రాజధాని శంకుస్థాపన నిర్మాణానికి వస్తారా లేదా అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. అమరావతి శంకుస్థాపనకు రావాలని కేసీఆర్ అధికారిక నివాసానికి చంద్రబాబు స్వయంగా వెళ్లి చంద్రబాబు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా "అన్నా.. మీరొచ్చి పిలిచారు.. తప్పకుండా వస్తా"నంటూ బాబుకు కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా, మీరు వస్తారన్న విషయం మీడియాకు మీరు చెప్తారా నేను చెప్పేదా అని కేసీఆర్‌ను చంద్రబాబు అడగగా, మీరే చెప్పండి అన్నా అంటూ కేసీఆర్ సమాధానమిచ్చారు కూడా. దీంతో కేసీఆర్ రాకపై ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, అదే రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన డబుల్ బెడ్ రూం ప్లాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. దీన్ని పక్కనబెట్టి.. పక్క రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా? అన్నదే ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశంపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది.
