శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (17:56 IST)

హిస్టరీ పాఠాలు సినిమాటిక్ గా చెప్పేవాడినిః దర్శకుడు శివుడు

Director Sivudu
వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి వున్న పాత్రలతో తీసిని సినిమా బ్రాందీ డైరీస్ అని ద‌ర్శ‌కుడు శివుడు తెలియ‌జేస్తున్నాడు. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ, మాది చిలకలూరిపేట దగ్గర తిమ్మాపురం. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ప్రతిరోజూ ఏదొక సినిమా చూసేవాడిని. సినిమా పుస్తకాలు చదివే వాడిని. అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేశాను. సినిమా కథలు రాసుకోవటానికి సమయం సరిపోవటం లేదని ఆ ఉద్యోగం మానేసి జూనియర్ లెక్చరర్ గా హిస్టరీ పాఠాలు చెబుతూ నా సినిమాలోకంలో ఉండే వాడిని. హిస్టరీ పాఠాలు సినిమాటిక్ గా చెప్పేవాడిని. ఆలా కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసేవి. ఇలా నా జీవితంలోకి ఆల్కహాల్ కూడా వచ్చింది. బాగా బానిస అయిపోయాను. మళ్ళి ఇప్పుడిపుడే కోలుకుంటున్నాను.
 
ఈరోజుల్లో సినిమా తీసి మెప్పిచడం చాలా కష్టం. ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు ఇప్పుడు ఓ టి టి ద్వారా చూడొచ్చు. ఎన్నో కొత్త కథలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఆహా అంటున్నాం. నేను కూడా కొత్తగా సినిమా చేయాలనీ, అది ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవ్వాలని ఈ బ్రాందీ డైరీస్‌ కథ రాసుకున్నా ప్రస్తుతం ప్రపంచం అంత ఆల్కహాల్ చుట్టు తిరుగుతుంది. ఇలాంటి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఈ సినిమా చేశాను.
 
ఆల్కహాల్ మంచిదా లేదా చెడ్డదా అని చెప్పలేదు కానీ ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి చెప్పాను. చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొందరు ప్రతి రోజూ పానీపూరీ తింటారు. అది కూడా అలవాటు లాంటిదే. ఇలా రకరకాల వారికి రకరకాల అలవాట్లు ఉంటాయి. మరి ఇన్ని అలవాట్లు ఉంటే ఆల్కహాల్ ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. ఆల్కహాల్ అతి ప్రాచీన కాలంనాటి నుంచి ఉన్న అలవాటే అని హిందూ పురాణాల్లో ఉంది. ఇంద్రుడు బాగా తాగుబోతని ఉంది. బైబిల్ లో కూడా బ్రెడ్, వైన్ తాగే సంప్రదాయం ఉంది. ప్రాచీనకాలం నుంచి ఉన్న సంస్కృతిని ఇప్పుడు నీచంగా చూస్తున్నారు. రెగ్యులర్ గా మన తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ వదిలేసింది అనే భాదతో ఆల్కహాల్ తాగుతాడు. లేదా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు. ఆలా ఒకటో రెండో సీన్ లు ఉన్నాయి.. కానీ నా సినిమాలో మొత్తం ఆల్కహాల్ మీదే నడుస్తుంది. సినిమాటిక్ గా మంచి కమర్షియల్ సీన్ తో చిత్రీకరించా.
 
ఈ టైటిల్ కథకి సరిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ఇది పూర్తిగా వినోద భరితమైన సినిమా. ఎటువంటి సందేశం కానీ లెక్చర్ కానీ లేదు. రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఈ కథ వ్యసన స్వభావం ఉన్న కొంతమంది కథ. ఆ వ్యసనం చుట్టు అల్లుకున్న ఒక అందమైన కుటుంబ కథ. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో ఉంటాయి. ఎటువంటి మెసేజ్ లేదు. ఈ చిత్రంలో ఆల్కహాలే హీరో మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే. కానీ ఆల్కహాల్ మంచి హీరోనా? చెడ్డ హీరోనా? అని తెలుసుకోవాలని ఉంటే  "బ్రాందీ డైరీస్" చిత్రం  చూడాల్సిందే. తాగుబోతుల్ని జడ్జ్ చేయటానికి మనకి రైట్ లేదు. అసలు ఎవరిని జడ్జ్ చేయకూడదు. మంచి చెడు జడ్జ్ చేయటానికి మనం ఎవరం. నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపించొచ్చు.
 
నా సినిమాలో అందరూ కొత్తవాళ్లే, కొత్త నటులు, సీనియర్ రంగస్థల నటులు ఉన్నారు. గుంటూరు, పాలకొల్లు, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి ఊళ్లల్లో మంచి ప్రతిభ ఉన్న రంగస్థల నటులున్నారు. వాళ్ళకి ఈ చిత్రం మంచి అవకాశం కల్పించింది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సెన్సార్ వాళ్ళు క్లీన్ ఫిల్మ్ అన్నారు. ఆల్కహాల్ ఉంది కాబట్టి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాను సొంతగా రిలీజ్ చేస్తున్నాం. మొత్తం 130 థియేటర్స్ లో విడుదల అవుతుంది. కర్ణాటకలో 30 థియేటర్ల‌లో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో చూసి ఈ చిన్న సినిమాను ఎంకరేజ్ చేయండి అంటూ తెలిపారు.