ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (18:26 IST)

మ‌రిచిపోయిన విద్య‌ను లక్ష్యతో చెబుతున్నాం- ఈసారి లాక్‌డౌన్ వ‌స్తే పెండ్లి చేసుకుంటా - నాగ‌శౌర్య‌

ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ఈ రోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. అన్నింటిని ఆటలు అని అంటాం కానీ ఒక్క ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం` అని క‌థానాయ‌కుడు నాగశౌర్య అన్నారు. 
 
కేతిక శర్మ  హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నాగ‌శౌర్య ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
- వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.
 
- కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను.
 
- ముందు ఏసియన్ సునీల్ గారు ఫోన్ చేశారు. ఓ కథ ఉంది వెంటనే వినాలని అన్నారు. సంతోష్ గారు వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేశారు. ప్రతీది విడమరిచి చెప్పారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా నిల్చోవాలి అంటూ ఇలా అన్నీ వివరించి చెప్పారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.
 
- ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. చదువు తప్ప నాకు అన్నీ  తొంద‌ర‌గా వస్తాయి.
 
- కొత్త దనం చూపించేందుకే ఈ సినిమాను చేశాం. సై సినిమానే మాకు స్ఫూర్తి. ఎవ్వరికీ తెలియని ఆటను తీసుకొచ్చి కమర్షియల్‌గా జోడించి అద్బుతంగా చూపించారు. నెరేషన్ బాగుంటే సినిమా అద్బుతంగా వస్తుంది. అందులో సంతోష్ సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది.
 
- దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్‌లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చింది.
 
- అందరికీ కూడా తామెంటో ప్రపంచానికి నిరూపించాలని అనుకుంటారు. అలానే పార్థు కూడా ప్రపంచానికి తానేంటో చూపించే ముందు తనలోని చెడుని ఎలా గెలిచాడు.. చివరకు ప్రపంచాన్ని ఎలా గెలిచాడు అనేది లక్ష్య థీమ్.
 
- సచిన్ ఖేడేకర్, జగపతి బాబు, కేతిక శర్మల ఇదే నా మొదటి సినిమా. అల వైకుంఠపురములో సినిమా అయిన వెంటనే మా సెట్‌లో జాయిన్ అయ్యారు. కానీ ఆయన ఏనాడూ కూడా కేరవ్యాన్‌లోకి వెళ్లలేదు. మాతో పాటు కూర్చుని సినిమా గురించి చర్చించేవారు. నేను బాగా నటించకపోతే వారి ముందు అంతగా కనిపించనేమోనని పోటాపోటీగా నటించేశాను.
 
- ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్థు మారాడు అని చెప్పడానికి అలా బాడీలో మార్పులు చూపించాను. ఒక్కసారి అనుకుంటే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదు.
 
ఈసారి లాక్డౌన్ వస్తే పెళ్లి ఖాయం
వరుడు కావలెను సినిమా తరువాత సంబంధాలేవీ రాలేదు. గత లాక్డౌన్‌లోనే పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో చంపేశారు. ఇంకోసారి లాక్డౌన్ వస్తే పెళ్లి చేసుకుంటాను. అలా అని లాక్డౌన్ రావాలని కోరుకోవడం లేదు.
కొత్త సినిమాలు
ఐరా ప్రొడక్షన్స్ నెంబర్ 4లో ఓ సినిమాను చేస్తున్నాను. ఇందులో బ్రాహ్మిణ్ కారెక్టర్‌ను పోషిస్తున్నాను. నాకు చాలా న‌చ్చిన క‌థ‌.  పలానా అమ్మాయి పలానా అబ్బాయి నాకు ఎంతో దగ్గరైన సినిమా. నటుడిగా నాకు ఎంతో సంతృ‌ప్తినిచ్చింది. ఇందులో ఏడు రకాల వేరియేష‌న్స్ ఉంటాయి. ఈ సినిమాను నా ముందు జనరేషన్స్‌కి, నా కుటుంబానికి చూపించుకునే మంచి సినిమా అవుతుంది. బాలయ్య గారితో సినిమా అనేది కేవలం రూమర్. ఏసియన్ నా హోం బ్యానర్. ఎన్ని సినిమాలైనా చేయొచ్చు.