సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (12:02 IST)

కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా కొత్త వేరియంట్!

దేశంలో కరోనా మహమ్మారి త‌గ్గిపోయిన‌ట్లు అంతా విచ్చ‌ల‌విడిగా భౌతిక దూరాన్ని పాటించ‌కుండా గ‌డిపేస్తున్నారు. కానీ, ఈ మ‌హ‌మ్మారి కొత్త రూపాన్ని సంత‌రించుకుని విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది.
 
 
దీంతో అధికారులు అప్రమత్తమై, వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు మరోవైపు కేరళలో కొత్తగా 7 వేల మందికి కొవిడ్​ సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కర్ణాటకలో ఏడుగురికి ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా,  మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.

 
ఏవై.4.2 కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కర్ణాటకలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని చెప్పారు. ఏవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్​కు వీటిని పంపినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  జన్యు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రంలో ఆరు లేదా ఏడు ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
 

మ‌రోవైపు కేరళ రాష్ట్రంలో భారీగా పెరిగిన మరణాలు అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 7,163 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 482 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యను సవరించగా, అధికంగానే ఈ స్థాయి మరణాలు నమోదయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,19,952కు చేరగా, మరణాల సంఖ్య 29,355కు పెరిగింది.
 

తమిళనాడులో కొత్తగా 1,090 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా మరో 15 మంది మృతి చెందారు. కొత్తగా 1,326 మంది వైరస్​ను జయించారు. ఒడిశాలో కొత్తగా 433 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు మరణించారు.