ఎమ్మెల్యే ఇంట్లో నిమ్మకాయ - మంత్రిచ్చిన తెల్లఆవాలు - పసుపు కుంకుమ విసిరేశారు...
జిల్లా కేంద్రమైన అనంతపురం నగరం అరవింద్ నగర్‌లో ఉంటున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం మంత్రిచ్చిన నిమ్మకాయ, తెల్ల ఆవాలు, పసుపు, కుంకుమ విసిరేయడం స్థానికంగా కలకలం రేపింది. కారులో వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యే కిటికీ వైపుగా మంత్రించిన సామాగ్రి విసిరేసినట్టు అక్కడ విధులు నిర్వహించే గన్‌మెన్లు వెల్లడించారు.
ఆ గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు వారు ప్రయత్నం చేయగా, తప్పించుకుని వేగంగా పారిపోయినట్టు వారు తెలిపారు. ఆ తర్వాత గన్‌మెన్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి, కారు నంబరు, సీసీ టీవీ ఫుటేజీలను అందజేసారు దీంతో సీఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా తన ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. అక్కడికి వచ్చిన ఏపీ39 కేఎక్స్ 0986 నంబరు కారు గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన మొగలి ఆదిలక్ష్మి పేరుపై ఉంది. ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ వారు గానీ, పుట్లూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులుగానీ క్షుద్రపూజలు చేయించి ఉంటారనే అనుమానాలను ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు.