రమ్య హత్య కేసులో శశికృష్ణ ను పట్టుకున్న కానిస్టేబుల్ ఇతడే!
గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 24 గంటలు తిరగకముందే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు గుంటూరు పోలీసుల ఘన విజయమనే చెప్పొచ్చు. ఆయితే, ఆ నిందితుడిని పట్టుకున్నది ఎవరో కాదు... ఓ సాధారణ కానిస్టేబుల్.
రమ్య హత్య చేసిన తర్వాత నిందితుడు శశికృష్ణ తన తల్లి ఉంటున్న గోళ్లపాడుకు చేరుకున్నాడు. మరో వైపు అతడిని గాలిస్తూ, గుంటూరు జిల్లా పోలీసులు 5 బృందాలు గా ఏర్పడి వెతికే పనిని ముమ్మరంగా చేపట్టారు. గోళ్లపాడులో నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ముప్పాళ్ల స్టేషన్ సిబ్బందిని అలెర్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడు శశి కృష్ణ గ్రామ శివారులో సేఫ్ ఔషధ కంపెనీ వైపు వెళ్తున్నాడని తెలిసి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మొహమ్మద్ రఫీ (HC3819) తన మోటర్ సైకిల్ పై బయలుదేరాడు. నిందితుడు శశికిరణ్ ను గంట పాటు వెంబడించాడు. శశి కిరణ్ కనిపించగానే, అతడిని పట్టుకునే క్రమంలో నిందితుడు ఓ కాల్వలోకి దూకాడు. దగ్గరికి వస్తే, చంపేస్తానని, కత్తితో బెదిరించినా రఫీ వెనుదిరగక కాల్వలోకి దూకాడు. శశి కిరణ్ తో పెనుగులాడి పట్టుకున్నాడు.
ఆ తరుణంలో శశికిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా యత్నించాడు. అయినా, చాకచక్యంగా రఫీ ఒక్కడే, నిందితుడిని సంభాళించి, తాను అతడిని పట్టుకున్నానని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. దీనితో మిగతా సిబ్బంది వచ్చి నిందితుడిని గుంటూరుకు తరలించారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ రఫి ధైర్య సాహసాలు ప్రదర్శించి హత్యా నిందితుడిని పట్టుకోడంతో అతడిని ఎస్సై పట్టాభిరామ్, తోటి సిబ్బంది అభినందించారు.