మంగళవారం, 18 నవంబరు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 నవంబరు 2025 (22:21 IST)

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

Migraine
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్‌ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది. నీరు లేకుండానే తీసుకునేలా సౌకర్యవంతమైన వినియోగానికి అనుగుణంగా రూపొందించిన 75 mg నోటి ద్వారా విచ్ఛిన్నమయ్యే టాబ్లెట్ రూపంలో రిమెజెపాంట్ అందుబాటులో ఉంది.
 
భారతీయ రోగులకు సకాలంలో, వేగవంతమైన నొప్పి ఉపశమనాన్ని అందించడం ద్వారా రిమెజెపాంట్ సమగ్ర మైగ్రేన్ సంరక్షణలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తుంది. మైగ్రేన్ పాథోఫిజియాలజీలో కీలకమైన పాత్ర పోషించే కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్(CGRP)ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ఈ ఔషధం త్వరితగతిన, ప్రభావవంతమైన ఉపశమనాన్ని అందిస్తుంది.
 
శ్రీమతి మీనాక్షి నెవాటియా, మేనేజింగ్ డైరెక్టర్, ఫైజర్ లిమిటెడ్, ఇండియా ఇలా అన్నారు, రిమెజెపాంట్‌ను భారతదేశానికి తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. మైగ్రేన్‌తో జీవిస్తున్న రోగుల జీవితాల్లో ఈ చికిత్స కలిగించే ప్రభావం చాల గొప్పది. ఇది నొప్పిని మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి, త్వరగా కోలుకుని సాధారణ కార్యకలాపాలకు తిరిగి చేరడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఫైజర్‌లో రోగుల జీవితాలను మార్చే ఆవిష్కరణలను అందించడం మా లక్ష్యం. రిమెజెపాంట్ ప్రారంభంతో ఆ దిశగా మేము కీలకమైన ముందడుగు వేస్తున్నాము.
 
CGRP రిసెప్టర్‌ను నిరోధించడం ద్వారా పనిచేసే రిమెజెపాంట్, ప్రభావవంతమైన మైగ్రేన్ చికిత్సగా వేగంగా రూపుదిద్దుకుంటోంది. అనుకూలమైన భద్రతా ప్రొఫైల్ తో కూడిన ఈ ఔషధం, రోగులు వేగంగా కోలుకుని తమ దైనందిన కార్యకలాపాలకు తిరిగి చేరుకునే అవకాశం కల్పిస్తుంది.
 
భారతదేశంలో మైగ్రేన్ ఒక గణనీయమైన సవాలుగా ఉంది, సుమారు 213 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తూ, సంవత్సరానికి సగటున 17.3 పనిదినాల మేరకు ఉత్పాదకతను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో, ఫైజర్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చికిత్స ఆధునిక చికిత్సా ఎంపికల లోటును పూరించడానికి, మైగ్రేన్ నియంత్రణలో వినూత్న పరిష్కారాల కోసం ఉన్న దీర్ఘకాల వైద్య అవసరాన్ని తీర్చడానికి కీలక ముందడుగుగా నిలుస్తుంది.