ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీకి సాంకేతికంగా సహకారం అందించిన మరో నిందితుడు జసిర్ బిలాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ వెల్లడించింది.
జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని ఖాజీగుండ్‌కు చెందిన జసిర్.. ఉగ్రదాడుల కోసం డ్రోన్లలో మార్పులు చేర్పులు చేసేందుకు సాంకేతిక సాయం అందించాడని, రాకెట్ల తయారీకీ యత్నించాడని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో సహ కుట్రదారుడిగా వ్యవహరించాడని, ఈ దాడి ప్లాన్‌లో ఉమర్‌తో కలిసి పనిచేశాడని పేర్కొంది.
ఉగ్ర కుట్ర కేసులో అరెస్టైన నిందితుల సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు ఇదివరకే జాసిర్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాను గత ఏడాది అక్టోబర్‌లో కుల్గాంలో ఉగ్ర నెట్‌వర్క్ సభ్యులను కలిశానని, అక్కడి నుంచి తనను అల్ ఫలా విశ్వవిద్యాలయంలోని అద్దె వసతి గృహానికి తీసుకెళ్లారని జాసిర్ తెలిపాడు.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తొలుత జసిర్‌తోపాటు అతడి తండ్రి, డ్రైఫ్రూట్స్ విక్రేత బిలాల్ అహ్మద్ వనీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బిలాల్‌ను విడిచిపెట్టారు. ఆదివారం ఆయన తనకు తాను నిప్పంటించుకోవడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.