మంగళవారం, 18 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 నవంబరు 2025 (21:27 IST)

అల్ ఫలహ్ వర్శిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు... చైర్మన్‌కు నోటీసులు

al falah univestity
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడుని పోలీసులు అరెస్టు చేశారు. పాతికేళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడుగా ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా, అరెస్టు అయిన వ్యక్తి పేరు హమూద్ అహ్మద్ సిద్దిఖీ. దాదాపు 25 ఏళ్ల క్రితం మహూలో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించాడు. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మబలికాడు. వందలాది మంది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడు. 
 
ఈ స్కామ్ బయటపడగానే 2000వ సంవత్సరంలో తన కుటుంబంతో సహా మహూ నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ​మహూ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ లలిత్ సింగ్ సికర్వార్ ప్రకారం.. హమూద్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అతను లో-ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తున్నాడు.
 
మరోవైపు, అల్ ఫలాహ్ ​యూనివర్సిటీ కార్యకలాపాలు, దానితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి జావెద్ సిద్ధిఖీ స్టేట్‌మెంట్ చాలా ముఖ్యమని పోలీసులు భావిస్తున్నారు. ​ఫరీదాబాద్ ఉగ్రవాద కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు జావెద్‌కు రెండు సమన్లు జారీ చేశారు. 
 
ేవర్సిటీపై నమోదైన ఫోర్జరీ, మోసం కేసుల విచారణకు సంబంధించి కూడా సమన్లు పంపారు. ​గత వారం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు విచారణలో భాగంగానే ఈ సమన్లు జారీ చేశారు. ఆ ఘటనలో 13 మంది చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. పేలుడుకు సంబంధించిన అనుమానితులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా పెరిగింది.