గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 నవంబరు 2025 (10:23 IST)

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు ఉమర్ నబీ

umar nabi
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగుచూసింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్‌ ఉమర్ నబీ డీఎన్ఏ మ్యాచ్‌ అయినట్లు సమాచారం. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 
 
ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్‌ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్‌ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. 
 
ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్‌ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధరించినట్లు సమాచారం.
 
ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఈ పేలుడు జరిపిన వ్యక్తి డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌ నబీ అని డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధరణ అయ్యిందన్నారు. అతడి తల్లి నుంచి తీసుకున్న నమూనాలతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేలుడు తర్వాత అతడి కాలు స్టీరింగ్‌ వీలు, యాక్సిలేటర్‌ మధ్య ఇరుక్కుపోయినట్లు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, పేలుడుకు కొన్ని గంటల ముందు రాజధానిలో ఓ మసీదుకు ఉమర్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎర్రకోట వైపునకు వెళ్లే ముందు రాంలీలా మైదాన్‌ సమీపంలో ఫైజ్‌-ఎ-ఇలాహి మసీదుకు వెళ్లినట్లు గుర్తించారు. ఉమర్ 10 నిమిషాలకు పైగా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.