భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?
గర్భవతిగా ఉన్న తన భార్యను, పుట్టబోయే కవల పిల్లలను కోల్పోయినందుకు కలత చెందిన ఒక వ్యక్తి సోమవారం శంషాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. శంషాబాద్ నివాసితులు అయిన ప్రైవేట్ ఉద్యోగి ఎం విజయ్ (40), అతని భార్య శ్రావ్య ఈ సంవత్సరం తమ కవల పిల్లలను ఆశించారు. శ్రావ్యకు ఎనిమిదో నెల గడుస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 16న, శ్రావ్య కడుపు నొప్పితో బాధపడుతుందని, ఆమెను ఆమె తల్లి అత్తాపూర్‌లోని ఆసుపత్రికి తరలించగా. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భస్థ శిశువులు చనిపోయారని, శ్రావ్య ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం, శ్రావ్యను అత్తాపూర్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె సోమవారం ఉదయం మరణించింది.
దీంతో షాకైన విజయ్ ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లి బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంటికి వచ్చిన విజయ్ అన్నయ్య సోదరుడు చనిపోయాడని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.