1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. High Temperatures Hits Telugu States

అయ్య బాబోయ్... ఠారెత్తిస్తున్న ఎండలు... నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

temparature
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతుందని తెలిపింది. 
 
వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు భారత వాతావరణ విభాగం వివరించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 45 డిగ్రీలకు చేరువైంది. బాపట్లలో గరిష్టంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 44.7 డిగ్రీలు, పోలవరంలో 44.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా 44.5, ఏలూరు 44.56, గుంటూరు 44.4, ప్రకాశం 44.3, కాకినాడ 44.28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. కోనసీమ 44.2, పలనాడు 44.21, నెల్లూరు 44.09, తిరుపతి 44.08, కృష్ణా 44, పశ్చిమగోదావరి 43.8, శ్రీకాకుళం 43.82, తూర్పుగోదావరి 43.7, అల్లూరి జిల్లా 43.7, కడప 42.8, విజయనగరం 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. వచ్చే రెండు మూడ్రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 46 డిగ్రీల వరకూ చేరే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
 
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు.. తప్పిన పెను ప్రమాదం