1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Honey Trap Scam at Jubilee Hills Pub

వైకాపా మహిళా నేత పబ్‌లో హనీట్రాప్ - ఒక్క బీరు ధర రూ.29,884 వసూలు

honeytrap
హైదరాబాద్ నగరంలోని వైకాపా మహిళా నేతకు చెందిన పబ్‌లో హనీట్రాప్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడికి డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ యువతి.. పబ్‌కు తీసుకెళ్లింది. అక్కడ యువకుడు ఒకే ఒక్క బీరు తాగగా, దానికి రూ.29,884 ధర వేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆ యువకుడుని బౌన్సర్లు చుట్టుముట్టారు. దీంతో పబ్‌పై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని ప్రకాశం జిల్లా వైకాపా మహిళా నేతకు చెందిన జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌లో జరిగిన ఈ హనీట్రాప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న కూకట్‌పల్లికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి డేటింగ్ యాప్‌లో దివ్య అనే ప్రొఫైల్‌తో ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోనులో మాట్లాడుకున్నారు. 
 
28న జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని '36 కెమిస్ట్రీ పబ్‌కు వెళ్లారు. ఆ యువతి జ్యూస్, కొన్ని ఆహార పదార్థాలు ఆర్డరిచ్చింది. అతడు ఒక బీరు తాగాడు. ఇంతలో నిర్వాహకులు రూ.29,884 బిల్లు చేతికిచ్చారు. ఒక్క బీర్‌కు ఇంత బిల్లు ఏంటని అతడు నిలదీశాడు. అదేసమయంలో పబ్ సిబ్బంది, బౌన్సర్లు చుట్టుముట్టడంతో యువతి తన బిల్లు రూ.10 వేలు చెల్లించానంటూ ఫోనులో నకిలీ లావాదేవీ చూపి ఉడాయించింది.
 
దీనిపై బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి, పబ్ యాజమాన్యం కుమ్మక్కయి తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టేందుకు ప్రయత్నించారంటూ బాధితుడు ఫిర్యాదు చేయటంతో ఇన్‌స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.భవానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
 
ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా మహిళా నాయకురాలికి పబ్‌లో భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఆరు నెలలుగా హనీట్రాప్‌కు పాల్పడుతున్నట్టు అంచనాకు వచ్చారు. పబ్‌లో తనిఖీలకు రానీయకుండా పోలీసులనూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మోసానికి పాల్పడిన యువతి కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ ఇకలేరు...