YS Avinash reddy: వివేకా గుండెపోటు నాటకాన్ని సృష్టించిందే సునీతనే.. వివాహేతర సంబంధాలపై..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని నాటకం సృష్టించిందే సునీతారెడ్డి అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాల్ని సునీత పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. వివేకా రెండో భార్యకు ఆస్తులు రాసిస్తారనే చెక్ పవర్ తీసేశారని, అందుకే హత్య చేయించి ఉండొచ్చన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని అవినాష్ ప్రశ్నించారు.
వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ అనే కోణంలో సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్ ప్రశ్నించారు. వివేకా చనిపోయాక పోలీసులకు సమాచారం ఇచ్చింది తానే అన్నారు. ఈ కేసులో అనేక కీలక అంశాల్ని సునీత పక్కదారి పట్టించారన్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఈ కేసును సాగదీయాలనేది ఆమె ఆలోచన అని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
ఈ కేసులో సునీత తప్పులు లేకపోతే దస్తగిరిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన బెయిల్ రద్దు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. మూడేళ్లుగా ఈ కేసు విచారణ ముందుకెళ్లకుండా ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లేఖను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. చంద్రబాబుకు మేలు జరగాలనే ఇలా వైఎస్ సునీత ప్రయత్నిస్తుందని వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలంటే ట్రయల్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డికి ఉన్న వివాహేతర సంబంధాలపై సీబీఐ ఎలాంటి విచారణ చేయలేదని చెప్పారు.
దస్తగరి, డ్రైవర్ ప్రసాద్, దస్తగిరి రెండో భార్య స్టేట్‌మెంట్‌ను ఎందుకు రికార్డు చేయలేదని తెలిపారు. ఒకసారి ఇచ్చిన వాంగ్మూలాన్ని మళ్లీ మార్చేందుకు సీబీఐ ఎలా అవకాశమిచ్చిందని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వన్ సైడ్ విచారణను సీబీఐ చేసిందని అన్నారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ దొరికిపోవడంతో మళ్లీ దానిని పక్క దోవపట్టించేందుకు మళ్లీ వైఎస్ సునీత ముందుకు వచ్చిందని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు.