జగన్ ఆంధ్రా ఫిష్ అంటే.. అవినాష్ నాటుకోడి అంటున్నారు : బీటెక్ రవి
గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా ఫిష్ అంటే.. ఇపుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి నాటుకోడి అంటున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, పరామర్శల పేరుతో దండయాత్రకు వెళ్లినట్టుగా జగన్ యాత్రలు చేస్తూ, ప్రజలకు నిత్యం నకరం చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదే అంశంపై బీటెక్ రవి గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత హోదా లేదని మాజీ సీఎం జగన్ చెప్పడం ప్రజలను అవమాన పరచడమేనన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు.
'పులివెందుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటం చాలా అవసరం. ఇక్కడి సమస్యలను గాలికి వదిలి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు ప్రభుత్వంపై వైకాపా నేతలు బురదచల్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ధరలు బాగా పెరిగాయి. టన్ను అరటికాయలకు రూ.26 వేల వరకు ఉందన్నారు.
ఇకపోతే, కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని మూడుసార్లు గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడటం లేదు. నాటుకోడి ధరల అంశాన్ని అక్కడ ప్రస్తావించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకురావడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. గతంలో జగన్ ఫిష్ ఆంధ్ర అంటే.. ఇప్పుడు అవినాష్ నాటుకోడి అంటున్నారు అని సెటైర్లు వేశారు.