దేవుడుతో పెట్టుకున్నావ్.. మీకు పుట్టగతులుండవ్ : జగన్‌కు సీఎం చంద్రబాబు హెచ్చరిక
తిరుమల వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ కూడా బాగున్న సందర్భాలు లేవని, అలాగే, వైకాపా నేతలకు కూడా పుట్టగతులు ఉండవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ, కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఎన్డీయే నేతలు, మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వారంతా మీడియాతో మాట్లాడారు.
'తప్పుచేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. బూతులు తిట్టినా మేం భరించాలా? దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తాం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ మాకు ఓ నివేదిక పంపింది. ఏక సభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తాం. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని అసెంబ్లీలో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాం. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే ఎదురుదాడికి దిగారు.
నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారు. కల్తీ జరుగుతోందని నివేదికలో చాలా స్పష్టంగా చెబితే దాన్ని తొక్కిపెట్టి యథేచ్ఛగా కొనసాగించారు. నేను సీఎం కాగానే ప్రక్షాళన మొదలుపెట్టా. పొరపాటు జరుగుతోందని శాంపిల్స్‌ను పరీక్షలకు పంపాం. ఎన్‌డీడీబీ నివేదికలోని అంశాన్నే నేను ప్రస్తావించా.
వైకాపా నేతలకు దేవుడంటే లెక్కలేనితనమనుకోవాలా? విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా? దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపం. ఇంతవరకు చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది. అపవిత్రం జరిగినప్పుడు భగవంతుడే ప్రజలను సమాయత్తం చేస్తారు. మీరు చేసిన పని దుర్మార్గమైన అపచారం అని చంద్రబాబు అన్నారు.