ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు ప్రజలు గుణపాఠం నేర్పినప్పటికీ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఎన్టీఆర్ 30వ వర్థంతిని పురస్కరించుకుని టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ,
తెలగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి అనేది ఒకటి ఉందని ఎన్టీఆర్ తన చేష్టల ద్వారా నిరూపించారన్నారు.
ముఖ్యంగా, బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారు. ఆయన పార్టీ పెట్టకముందు పెద్దగా చదువుకోని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారు.
చదువుకున్నవారికే ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చేవారు. తిరుమల తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎన్టీఆరే. ఆయన వచ్చాకే కృష్ణా మిగులు జలాల్లో మనకూ హక్కు ఉందని చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
రాష్ట్రంలో సూపర్‌సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేశాం. రాష్ట్రంలో త్వరలో 700 అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉగాది రోజున మరో 5 లక్షల గృహప్రవేశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలను అమలు చేస్తున్నాం. మన పూర్వీకులు ఇచ్చిన భూమికి.. గత పాలకులు ఫొటోలు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్లినా 80 శాతం ఫిర్యాదులు భూములపైనే వస్తున్నాయి.
గత ప్రభుత్వంలో రూ.700 కోట్లు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపై వాళ్ల ఫొటోలు వేయించుకున్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించి నిజమైన సంక్రాంతి కానుక ఇచ్చాం. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తూ కీలకపాత్ర పోషిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇకపోతే, అవినీతి సొమ్ముతో మీడియా సంస్థ పెట్టిన పార్టీతో పోరాడాల్సి రావడం మన దౌర్భాగ్యమన్నారు. క్రెడిట్ చోరీ అంటూ గ్రీన్ కో, భోగాపురం ఎయిర్‌పోర్టుపై సొంత మీడియాలో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, వైన్ వైకాపా క్రెడిట్ అని వ్యాఖ్యానించారు.
సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ మన క్రెడిట్. రెండింటికీ పొంతనే లేనప్పుడు క్రెడిట్ చోరీకి అవకాశం ఎక్కడుంది? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని అవుతుందా? మూడు ముక్కలాటను ప్రజలు నమ్మలేదు కాబట్టే మూడు ప్రాంతాల్లో విజయం అందించారు. ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.