సంబంధిత వార్తలు
- మళ్లీ ఆంధ్రపై పడ్డ కేసీఆర్, అసలు ఆయన బాధేంటి?
- ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదు, దమ్ముంటే రా తేల్చుకుందాం: రేవంత్ రెడ్డి
- మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య
- TTD: పరకామణిలో దొంగలు పడ్డారు.. జగన్ గ్యాంగ్ పాపం పండింది.. వీడియోలు వైరల్
- ప్రజారోగ్యానికి ఏపీ సర్కారు పెద్దపీట : గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు
తితిదే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తితిదే బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడులకు ఆయన పంపించారు. ఈ విషయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2005లో తిరుమల బాలాజీ నగర్‌లో ఫ్లాట్ నం.2ను డొనేషన్ స్కీం కింద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో 12 గదులతో అతిథి గృహం నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేశాం. ఒక గది మినహా మిగిలిన 11 గదులు భక్తులకు ఇచ్చేందుకు, నిర్వహణ ట్రస్ట్ చూసేలా, ఒక గది ట్రస్టుకు ఉండేలా ప్రణాళిక రూపొందించాం. అప్పట్లో డబ్బులు సర్దుబాటు కాక నిర్మాణం ప్రారంభించలేకపోయా. డొనేషన్ చెల్లింపునకు గడువు పెంచాలని కోరడంతో జీవో జారీ అయింది.
ఈవోగా ధర్మారెడ్డి ఉన్న సమయంలో రూ.60 లక్షల వరకు డొనేషన్ చెల్లించా. అప్పట్లో తాను తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. తన డొనేషన్ వెనక్కి ఇచ్చేసి, ప్రతిపాదన తిరస్కరించారని చెప్పారు. బోర్డు సభ్యుడిగా తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, భక్తి భావంతో స్థలం తనకు రీ ఎలాట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
ఈ విషయాన్ని పరిశీలన కోసం తితిదే బోర్డుకు పంపగా, బోర్డులో భానుప్రకాష్ రెడ్డి మినహా మిగతా సభ్యులంతా సమ్మతించారు. ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపించారు. బోర్డు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోర్డులో అంతర్గతంగా జరుగుతున్న చర్చపై ఓ పత్రికలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనం రావడంతో మనస్తాపం చెందా. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేశా. స్థలం రీఎలాట్ విషయంలో మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చ జరిగిందో నాకు తెలియదు అని జంగా కృష్ణమూర్తి వివరించారు.
