తిరుపతి కేంద్రం అతిపెద్ద రీసెర్స్ సెంటర్ : సీఎం చంద్రబాబు
ప్రముఖ పర్యాటక కేంద్రం తిరుపతి జిల్లా కేంద్రం అతిపెద్ద రీసెర్స్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులోభాగంగా ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఈ రీసెర్స్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు.
యువతరం భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా వారికి అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ మేరకు భవిష్యత్‌లో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల డివైజెస్-సెన్సర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోందని వివరించారు.
ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోందని సీఎం తెలిపారు. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు.. వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా.. స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అతి పెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరమన్న సీఎం.. తిరుపతిలో ఏర్పాటు చేసే ఏపీ-ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా ఉండాలన్నారు. రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు.