1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA Mekapati Chandrasekhar Reddy falls ill

ఉదయగిరి వైకాపా రెబెల్ ఎమ్మెల్యేకు గుండెపోటు.. చెన్నై ఆస్పత్రికి తరలింపు

mekapati chandrasekhar reddy
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకు ప్రాథమికంగా ఇంట్లోనే వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆయనను చెన్నైకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒకసారి గుండెపోటుకు గురైన మేకపాటి.. ఇపుడు మరోమారు ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను రప్పించి చికిత్స అందించారు. 
 
గత నెలలో కూడా మేకపాటికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో వాల్వ్‌లో రెండు బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత తగిన వైద్యం చేయడంతో ఆయన కోలుకున్నారు. అదేవిధంగా గత 2011 డిసెంబరులోనూ ఆయనకు గుండెపోటు వచ్చింది. అపుడు బెంగుళూరుకు తరలించి వైద్యం చేయించారు. రెండుసార్లు గుండెపోటు రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన తాజా రాజకీయ పరిణామాలతో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో ఇపుడు మరోమారు అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. 
 
కాగా, ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి అనురాధకు ఓటు వేసినట్టు అనుమానించిన వైకాపా అధిష్టానం ఆ నలుగురిని వైకాపా నుంచి సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వర్సెస్ వైకాపా నేతల మధ్య ఆధిపత్య, మాటల యుద్ధం కొనసాగుతోంది. 
తర్వాతి కథనం
తిరుపతికి వందే భారత్.. ప్రయాణ సమయాలు ఇవే...