1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 24 మార్చి 2023 (09:54 IST)

టీడీపీలో చేరనున్న వైకాపా తిరుగుబాటు నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

giridhar reddy
నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా తిరుగుబాటు నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈయన నెల్లూరు రూరల్ వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీ అధినేత చంద్రబాబు చెంతకు చేరుతున్నానని, అందువల్ల ఈ కార్యక్రమానికి మద్దతుదారులు భారీగా తరలివచ్చి తనను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. అటు నుంచి తాడేపల్లికి తరలివెళ్లేలా ఏర్పాట్లుచేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన గిరిధర్‌రెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కొంతకాలంగా వైకాపాకు దూరంగా ఉన్నారు. అలాగే, తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైకాపా అభ్యర్థికి వ్యతిరేకంగాను, టీడీపీ అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన విషయం తెల్సిందే.