శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (08:22 IST)

నేడు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు - టీడీపీ పోటీతో పెరిగిన ఉత్కంఠ

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఏడు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో వైకాపా నుంచి ఏడుగురు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీ పడుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను కూడా వెల్లడించారు. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో ఒక స్థానం ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైకాపా సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ఏకంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.
 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అధికార వైకాపా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తమ ఎమ్మెల్యేలకు అవగాహన కలిగించేలా ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. సంఖ్యా బలం అనుకూలంగా లేనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. టీడీపీ అభ్యర్థిగా మహిళా నేత పంచుమర్తి అనురాధ పోటీలో ఉన్నారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో నలుగురు వైకాపా తరపున ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యాబలం 19కు చేరింది. 
 
అయితే, ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. కానీ, ఈ ఓటింగ్ రహస్యంగా జరుగుతుంది. దీంతో వైకాపా రెబెల్స్ ఎమ్మెల్యేలు అయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఆ లెక్కన టీడీపీ సంఖ్యా 21కు చేరుకుంది. మరొక్క వైకాపా ఎమ్మెల్యే టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపొదడం ఖాయంగా తెలుస్తుంది. దీంతో ఒక స్థానం ఎన్నికతో పాటు.. నెల్లూరు జిల్లా రెబెల్ వైకాపా ఎమ్మెల్యేల ఓట్లు ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల కోసం అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.