బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీ అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యేపై వైకాపా ఎమ్మెల్యేల దాడి

ap assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సోమవార రణరంగాన్ని తలపించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో పాటు అధికార వైకాపాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు దాడి చేశారు. దీంతో తెదేపా సభ్యులు ఒక్కసారిగా స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఏడో రోజున టీడీపీ సభ్యులు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పోడియం దగ్గర జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇంతలో వైకాపా సభ్యులు సుధాకర్ బాబు టీడీపీ ఎమ్మెల్యే వీరా బాల వీరాంజనేయ స్వామిపై చేయి చేసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైకాపా నేతలు కూడా ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఈ దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే సోమవారం దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారన్నారు. సోమవారం సభలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. 
 
చట్టసభలకు మచ్చ తెచ్చిన సిఎంగా నిలిచిపోతారని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించారని, ఇది శాసన సభ కాదు... కౌరవ సభ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
కాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.