ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రాజకీయాలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుడ్‌బై?

kotamreddy sridhar reddy
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు స్వస్తిచెప్పాలన్న ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వైకాపా అధినాయకత్వంతో పాటు వైకాపా ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నిఘా పెడతారా అంటూ బహిరంగంగానే ప్రభుత్వ పెద్దలకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశంపై ఆయన పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తన సోదరుడిపై తాను పోటీ చేయనని, రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. గత మూడు నెలలుగా తన ఫోన్ ట్యాప్ అవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగడం కష్టమని కోటంరెడ్డి పేర్కొన్నారు. రహస్య సంభాషణలు, పలు సిమ్ కార్డుల కోసం తన వద్ద మరో ఫోన్ ఉందని వెల్లడించాడు.
 
మరోవైపు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేసేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగం సిద్ధం చేసింది. ఆయన స్థానంలో ఆనం విజయ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలలో ఒకరికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రంగంలోకిదిగారు. దీంతో కోటంరెడ్డిపై ఏ క్షణమైనా వేటుపడే అవకాశం ఉంది.