Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Haasan, Suryadevara Naga Vamsi
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. '90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఛాయాగ్రాహకుడిగా అజీమ్ మహమ్మద్, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. 'ఎపిక్' గ్లింప్స్ చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది. లండన్‌లో జరుగుతున్న విద్యార్థుల స్నాతకోత్సవం నేపథ్యంలో గ్లింప్స్ ప్రారంభమైంది. ఇందులో వైష్ణవి చైతన్య, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో మాట్లాడుతుంది. ఈ క్రమంలో ప్రజాకవి, గాయకుడు గద్దర్ ను గుర్తు చేసే అవతారంలో కనిపించి ఆశ్చర్యపరుస్తారు ఆనంద్ దేవరకొండ. "శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ" అనే సంభాషణ ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా, ఎంత వినోదభరితంగా ఉండబోతుందో తెలిపింది. '90s' వెబ్ సిరీస్ లో రోహన్ పోషించిన ఆదిత్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం.
ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన 90s వెబ్ సిరీస్ చూశాను. సిరీస్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. గ్లింప్స్ లో ఆదిత్య ఎలాగైతే అమ్మాయితో మాట్లాడాడో, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాగే తడబడుతూ మాట్లాడేవాడిని. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రతి అంశం, ప్రతి సన్నివేశం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఆదిత్య హాసన్ రాసిన ఇంతమంచి కథలో భాగం కావడం సంతోషంగా ఉంది. వైష్ణవి అద్భుతంగా నటించింది. లండన్ లో జరిగే కథ అయినా.. ఇది మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.
కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ఇది యువతకు నచ్చే అందమైన ప్రేమ కథ. హీరో పాత్రకు చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిత్య హాసన్ గారు మనలాంటోడు, మనలో ఒకడిగా కనిపిస్తారు. అందుకే ఆయన కథలు అందరికీ కనెక్ట్ అవుతాయి. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది." అన్నారు.
దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. "90s దర్శకుడిగా, ప్రేమలు రచయితగా, లిటిల్ హార్ట్స్ నిర్మాతగా.. ఏం చేసినా నిజాయితీగా చేశాను. మన చుట్టూ జరిగితే చిన్న కథలను తీసుకొని, వాటిని అందంగా తెరపైకి తీసుకురావడం నాకు ఇష్టం. ఇప్పటివరకు అదే ప్రయత్నించాను. 90s కథ విని కొందరు ఇందులో ఏముంది అన్నారు. కానీ, నేను ఆ కథను నమ్మి చేశాను.. అది విజయం సాధించింది. ఎపిక్ సినిమాని కూడా నమ్మి చేస్తున్నాను. ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారు. ప్రతి సన్నివేశం మీకు నచ్చుతుంది. ఈ చిత్రానికి మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది." అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. 90s వెబ్ సిరీస్ చూసి ఆదిత్య హాసన్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాము. ఆదిత్య వచ్చి ఈ రొమాంటిక్ కామెడీ కథ చెప్పగానే.. వెంటనే చేయాలి అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా ఈ తరహా చిత్రాలకు పెద్ద అభిమానిని. ఒక మంచి సినిమా చేశాము." అన్నారు.
'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'ను ఒక ఉత్తేజకరమైన మరియు భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. ఇది యువ హృదయాల అమాయకత్వాన్ని, సంఘర్షణలను, మౌన భావాలను సంగ్రహిస్తుందని తెలిపారు. నిజాయితీతో ఆవిష్కరించబడే అసంపూర్ణమైన కథగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం త్వరలో భారీస్థాయిలో విడుదల కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్
కూర్పు: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె వర్మ
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వీఎంఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్