1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Southwest Monsoon Enter Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు... నేటి నుంచి తేలికపాటి వర్షాలు

southwest monsoon
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అవి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఈ యేడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, స్థానిక వాతావరణ పరిస్థితులు కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చని తెలిపింది. 
 
ముఖ్యంగా, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడొచ్చు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్‌ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవొచ్చని పేర్కొంది. 
 
ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ వివరించింది. 
 
అదేసమయంలో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 'ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 
 
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 104 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయి. శనివారం కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని వివరించింది.
About Writer
ఠాగూర్