తెలంగాణ సర్కారు చేపట్టే ప్రాజెక్టులతో ఏపీకి చుక్కనీరు రాదు: జగన్మోహన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో మూడురోజులుగా చేపట్టిన జలదీక్షను బుధవారం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నాయని... దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీకి చుక్క నీరు రాదన్నారు.
నదుల నీటిని రాష్ట్రాల వాటాల ప్రకారం సక్రమంగా వినియోగించుకుంటే ఎవరికీ నష్టం ఉండదన్నారు. అలాకాకుండా ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే దిగువ రాష్ట్రాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టులకూ అనుమతులు లేవని... ఇదేంటని అడిగితే మా రాష్ట్రం.. మా ఇష్టం అంటున్నారని... ఇదేమైనా సమంజసంగా ఉందా? అని అన్నారు. కేసీఆర్‌ను గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసు తిరగదోడి జైలుకు పంపిస్తారేమో అని చంద్రబాబు భయపడుతున్నారని జగన్ అన్నారు.
